: మేమెందుకు చేయాలి.. మీరే రాజీనామా చేయండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం!: కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ కౌంటర్
కాంగ్రెస్ నేతల పాలనలో ముస్లింలను ఓటు బ్యాంకులా ఉపయోగించుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో టీడీపీ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తమ పార్టీలో చేరిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, టీఆర్ఎస్‌లో చేరిన నేతలు రాజీనామా చేయాలని అంటున్నారని, ఆయా స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారని, అసలు తమ పార్టీ నేతలు ఎందుకు రాజీనామా చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కి రాష్ట్రంలో మళ్లీ గెలిచే సత్తా ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లాలని, ఎవరు గెలుస్తారో చూద్దామని కేసీఆర్ సవాల్ విసిరారు. తమ పార్టీ నేతలు ఉద్యమం సందర్భంగా ఎన్నోసార్లు రాజీనామా చేశారని, తాను నాలుగైదు సార్లు రాజీనామా చేశానని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులకు కూడా తమ పార్టీ నేతలు గతంలో రాజీనామా చేశారని ఉద్ఘాటించారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచామని, కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసి గెలవగలరా? అని ఆయన ప్రశ్నించారు. తాము ఇప్పుడెందుకు రాజీనామా చేస్తామని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలిచిందని, వచ్చే జనరల్ ఎన్నికల్లోనూ తెలంగాణ మొత్తం అదే మెజారిటీతో గెలుస్తామని అన్నారు.
తమ ప్రభుత్వం ఇసుక అక్రమరవాణాను అరికట్టిందని, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నామని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కేసీఆర్ అన్నారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగవని అన్నారు. గొప్పగా పనిచేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు.