: బొకారో సమీపంలో రైల్వే ట్రాక్ ను పేల్చి వేసిన మావోయిస్టులు... ఆపై రోడ్డు మీదకొచ్చి విధ్వంసం
తామిచ్చిన 24 గంటల జార్ఖండ్ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు తెగించారు. ఈ ఉదయం బొకారో జిల్లాలో రైల్వే ట్రాక్ లను పేల్చి వేశారు. ఆపై రహదారిపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలకు నిప్పు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు భూ చట్టాలను తీసుకురాగా, వాటిని వ్యతిరేకిస్తున్న మావోలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మావోలు చియాంకి - కర్మబంద్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ ను పేల్చి వేశారని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ కారణంతో రైళ్లను నిలిపివేశామని తెలిపారు. గిరిదిహ్ దుమ్రీ ప్రాంతంలో రోడ్డుపై వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. దాదాపు 12 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడగా, రైల్వే ట్రాకుల మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాలకు, దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేసిన అధికారులు, నగరాల్లో తిరిగే బస్సులను మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.