: బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నందుకు కొట్టి చంపేశారు!
నలుగురూ తిరిగే ప్రాంతంలో మూత్ర విసర్జన చేయవద్దని చెప్పిన పాపానికి ఓ యువకుడిని కొట్టి చంపేసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో ఓ ఈ-రిక్షా స్టాండు పార్కింగ్ అటెండెంట్ గా రవీంద్ర కుమార్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు రిక్షా స్టాండులో మూత్ర విసర్జన చేస్తుంటే వారించాడు. దీంతో ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వారు, కాసేపటికే ఓ గ్యాంగుతో వచ్చి రవీంద్రపై దాడికి దిగి విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలతోనే ఇంటికి వెళ్లిన బాధితుడు, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలుపుతామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, బహిరంగ మూత్ర విసర్జనను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ క్లీన్ ఇండియా ప్రచారంలో భాగంగా ప్రజా టాయిలెట్ల సంఖ్యను గణనీయంగా పెంచినప్పటికీ, బహిరంగ మూత్ర విసర్జన చట్టపరంగా నేరం మాత్రం కాదన్న సంగతి తెలిసిందే.