: చుట్టుముట్టిన నాలుగు కుక్కలను చెడుగుడు ఆడేసిన బాలుడు.... వీడియో చూడండి
చుట్టూ చీకటి, వీధి నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలోకి ఇద్దరు చిన్నపిల్లలు అడుగుపెట్టారు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ఒక కుక్క వారిని చూసి అరిచింది. అంతే.. ఇంతలో దానికి మరో రెండు కుక్కలు జతకలిశాయి. వాటిని చూసిన ఆ ఇద్దరిలోని ఓ పాప వెంటనే వెనక్కి పరుగెత్తింది. దీంతో కుక్కలకి ధైర్యం వచ్చేసింది. బాలుడు మాత్రం పురుగెత్తాలా? వద్దా? అని తటపటాయించి రెండు అడుగులు వేశాడు. అంతే, మరో వైపు నుంచి మరో కుక్క...నాలుగు వైపులా కాసేశాయి. ఇక పరుగెత్తే అవకాశం కూడా లేదు. దీంతో ఆ బుడతడు శునకాలను ఎదిరించాడు.
వాటిపై ఎదురు దాడికి దిగినట్టు నాలుగు వైపులా ఉన్న కుక్కలను చెడుగుడు ఆడేశాడు. చిన్నపాటి గాయం కూడా కాకుండా నాలుగు కుక్కల్ని తరిమికొట్టాడు. ఈ ఘటన హైదరాబాదు, మూసాపేట, ఆంజయనేయనగర్ ప్రాంతంలో చోటుచేసుకోగా, ఆ వీధిలో ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిమిషం నాలుగు సెకన్ల పాటు నమోదైన ఈ ఘటనను సోషల్ మీడియాలో పెట్టగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఆ చిన్నారి గురించి ఆరాతీయగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కుమారుడు చందుగా తేలింది. పిల్లవాడి ధైర్యాన్ని అంతా అభినందిస్తున్నారు.