: నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన ఇది: కార్యకర్త వితరణకు చలించిన చంద్రబాబు
విశాఖపట్నంలో టీడీపీ మహానాడు రెండవ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్త రత్తయ్య.. పోలవరం, రాజధాని నిర్మాణాలకు విరాళంగా తన చేతి ఉంగరాలు, బంగారు గొలుసులు తీసేసి ఏపీ సీఎం చంద్రబాబుకి ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్న రత్తయ్య.. వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తాను పడే కష్టాన్నిచూసి బాధపడ్డ రత్తయ్య తన వంతుగా సాయం చేయాలని బంగారాన్ని ఇచ్చారని అన్నారు. ఇది ఒక కమిట్ మెంట్ అని, కొన్ని సంఘటనలు మనసును చలించేలా చేస్తాయని అన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తోంటే రత్తయ్య మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా సాయం చేశారని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన ఇదని చంద్రబాబు అన్నారు.