: ఐటీ సమస్యకు కారణమైందని ఇండియాను తిడుతూ అన్ని విమానాలనూ రద్దు చేసిన బ్రిటీష్ ఎయిర్ వేస్!
బ్రిటీష్ ఎయిర్ వేస్ కంప్యూటర్ వ్యవస్థ మొత్తం క్షణాల్లో నిలిచిపోగా, దీనికి ఇండియానే కారణమని ఆ సంస్థ యూనియన్ తిట్టిపోసింది. శనివారం నాడు బ్రిటీష్ ఎయిర్ వేస్ ఐటీ వ్యవస్థలో సమస్యలు ఏర్పడగా, వందలాది ఉద్యోగాలను ఇండియాకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఇవ్వడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని తిట్టి పోసింది. విమానాల షెడ్యూల్, టికెటింగ్, బోర్డింగ్ తదితరాలు నిలిచిపోవడంతో లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు టేకాఫ్ కావాల్సిన విమానాలన్నీ నిలిచిపోయాయి.
కాగా, ఔట్ సోర్సింగ్ వల్ల వ్యవస్థ నిలిచిపోయే సమస్య ఎన్నటికైనా ఎదురవుతుందన్న విషయాన్ని గత సంవత్సరం ఫిబ్రవరిలోనే జీఎంబీ వెబ్ సైట్ హెచ్చరించింది. ఎయిర్ లైన్స్ కు చెందిన కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహించాలని తాము సూచించినా పట్టించుకోనందునే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందని జీఎంబీ నేషనల్ ఆఫీసర్ ఫర్ ఏవియేషన్ మిక్ రిక్స్ వ్యాఖ్యానించారు.