: వదిలివేయాలని ప్రాధేయపడుతున్నా వినకుండా... ఇద్దరు అమ్మాయిలను వేధించిన 14 మంది బాలురు!
ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు మరింత ఘోరంగా మారిపోతున్నాయనడానికి ఇది మరో ఉదాహరణ. ఇద్దరు అమ్మాయిలను, 12 నుంచి 14 మంది వరకూ బాలురు, యువకులు చుట్టుముట్టి వేధిస్తుండగా, వారిలోనే కొందరు అదో ఘనకార్యమైనట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఏ మాత్రం భయం లేకుండా అమ్మాయిల వెంట పడిన వారిలో పట్టుమని పదేళ్లు కూడా నిండని వారు కూడా ఉన్నారు.
వీరిలో ఒకడైతే, ఏకంగా అమ్మాయిని ఎత్తుకుని పరిగెత్తబోయాడు. తమను విడిచి పెట్టాలని వారు బతిమాలుకున్నా వినలేదు. నవ్వుతూ, వారిపై చెత్త జోకులేస్తూ తాకరాని చోట తాకుతూ పైశాచికానందాన్ని పొందారు. రాంపూర్ లోని ఓ పార్కులో జరిగిన ఘటన వీడియో వైరల్ కాగా, స్పందించిన పోలీసులు, విచారణ చేపట్టి ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మిగతావారిని గుర్తించామని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా, మార్చిలో యూపీ సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన తరువాత, మహిళల రక్షణ కోసం యాంటీ రోమియో స్క్వాడ్ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.