: గాళ్ ఫ్రెండ్‌తో వీడియో చాట్.. వాగ్వాదం.. లైవ్‌లో ప్రియుడి ఆత్మహత్య!
గాళ్ ఫ్రెండ్‌తో వీడియో చాట్ చేస్తుండగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరగడంతో లైవ్‌లోనే బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని పూరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పూరీ సీ బీచ్ ప్రాంతానికి చెందిన సైకతరావు (25) భువనేశ్వర్‌లో తనతో కలిసి చదువుకున్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తయ్యాక యువతి తన సొంత ఊరు కోల్‌కతా వెళ్లిపోయింది. అయినప్పటికీ రోజూ సైకతరావుతో ఫోన్లో టచ్‌లో ఉండేది.
శనివారం సైకతరావు ప్రియురాలితో వీడియో చాటింగ్ చేశాడు. ఈ సందర్భంగా యువతి మరో యువకుడిని ప్రేమిస్తున్నట్టు అనుమానించిన యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని, చూస్తూ ఉండమని అన్నాడు. వెంటనే యువతి సైకతరావు తల్లికి ఫోన్ చేసి రక్షించమని కోరింది. ఆ సమయంలో వారు ఇంటికి దూరంగా మార్కెట్లో ఉండడంతో వేగంగా ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే సైకతరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.