: దారుణం... దగ్గరుండి మరీ భార్యను ముగ్గురు అన్నలతో గ్యాంగ్ రేప్ చేయించాడు!
భార్యను దగ్గరుండి మరీ తోడబుట్టిన అన్నలతో సామూహిక అత్యాచారం చేయించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని దహోద్ జిల్లాలో గడోయి గ్రామానికి చెందిన యువతి (19)కి సమీప అభ్లోద్ గ్రామానికి చెందిన వ్యక్తితో (20) గతేడాది వివాహం జరిగింది. అయితే వివాహమైన నాటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇవి మరింత తీవ్ర రూపం దాల్చడంతో ఆమె ఈనెల 20న పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కక్షగట్టిన భర్త ఆమె జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుని ఈ నెల 24న ఆమె ఇంటికి వెళ్లాడు. జరిగినదేదో జరిగిపోయిందని, ఇకపై భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యంగా కలిసి ఉందామని తనతో ఇంటికి రావాలని కోరాడు.
దీంతో తన భర్తలో మార్పు వచ్చిందని, ఇక భవిష్యత్ బాగుపడబోతోందని ఆమె ఆశపడి అతనితో వెళ్లింది. అప్పుడు కానీ తాను జీవితంలో ఎంత పెద్దతప్పు చేశానో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆశలన్నిటినీ అడియాసలు చేస్తూ, ఇంటికి రాగానే ఆమెను ఒక గదిలో బంధించాడా దుర్మార్గుడు. ఈ లోగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు... తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని, ఆమె జాడ కనిపెట్టాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ భర్త దగ్గరుండి, తన ముగ్గురు అన్నలతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. అనంతరం పుట్టింటికి వెళ్లిపోవాలని ఆమెను బెదిరించారు. దీంతో పుట్టింటికి చేరిన బాధితురాలు జరిగిన ఘోరంపై పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని, అతని ఓ అన్నను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు అన్నల కోసం గాలింపు చేపట్టారు. భర్తపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.