: నలుగురు మహిళల అత్యాచార ఘటనలో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో కనిపించని రేప్ ఆనవాళ్లు!
దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్లోని జెవార్ దోపిడీ, అత్యాచారం ఘటనలో పోలీసులు, వైద్యాధికారులు కీలక ప్రకటన చేశారు. బాధితులకు నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్ఎస్పీ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. సూపర్మాటోజో పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయినట్టు వివరించారు.
ఓ వాహనంలో బులందర్షహర్ వెళ్తున్న కుటుంబాన్ని అడ్డగించిన సాయుధులు వారిలోని ఒకరిని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుపోయారు. అంతేకాక నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమ కణతలపై తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళలు ఆరోపించారు. అయితే వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని వైద్యులు చెబుతుండడం ఈ కేసులో ప్రాధాన్యం సంతరించుకుంది.