: నక్కలు, కుక్కలు, పందులు అంటూ మాట్లాడతారా? ఏం మాటలివి?: నాగంపై హరీశ్‌రావు ఫైర్
భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... గొల్ల, కురుమల నుంచి అందరి కుల వృత్తులను గౌరవిస్తూ తాము వారి వృత్తులకు చేయూతనిస్తున్నామని, గొర్రెలను, చేపలను అందిస్తూ సాయపడుతూ వారి ఆర్థికాభివృద్ధికి సాయపడుతున్నామని అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి మాత్రం నక్కలు, కుక్కలు, పందులు అని పలు వ్యాఖ్యలు చేశారని హరీశ్‌రావు అన్నారు. మాట్లాడే పద్ధతి అదేనా? అని ఆయన ప్రశ్నించారు. మా గొల్ల, కురుమలు మీకు నక్కల్లాగ కనపడుతున్నారా? అని ప్రశ్నించారు. వాళ్లకు గొర్రెపిల్లలనిస్తే మీకు నష్టం ఏమిటి? అని అడిగారు. మత్స్యకారులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తాము చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి, వారి వృత్తిని బలోపేతం చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని బీసీలందరూ తమ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని హరీశ్ రావు చెప్పారు. తాము చేస్తోన్న పనుల పట్ల కళ్లల్లో నిప్పులు పోసుకొని, ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాగం జనార్దన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని అన్నారు. బీజేపీ నేతలకు ప్రభుత్వంపై బురద చల్లడం అలవాటయిందని చెప్పారు. నాగం ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదని అన్నారు. నాగం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? బీజేపీ తరఫునా? అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్.. నాగం వ్యాఖ్యలపై స్పందించి వివరణ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దేశమంతా తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను అభినందిస్తోందని, కుల వృత్తులను నాగం అవమానిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, నాగం జనార్దన్ రెడ్డి కూడా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. నాగంకి హైకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదని అన్నారు.