: బావను కొట్టి చంపిన బావమరుదులు!
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగాం గ్రామంలో భిక్షపతి అనే వ్యక్తిని అతడి ఇద్దరు బావమరుదులు గొడ్డలితో నరికి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పలు వివరాలు తెలిపారు. బాధితుడు భిక్షపతి జనగాం గ్రామ వాసి. అతడికి మెదక్ జిల్లా రామాయంపేట మండలం పెద్దనిజాంపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా 15 రోజుల క్రితం లక్ష్మి తన పుట్టింటికి వచ్చేసింది. నిన్న రాత్రి లక్ష్మి సోదరులు విభూతిరాజు, కృష్ణకుమార్‌లు భిక్షపతికి నచ్చజెప్పేందుకు వచ్చారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు. భిక్షపతితో గొడవ చెలరేగి అది పెద్దదిగా మారింది. దీంతో రాజు, కృష్ణకుమార్ కలిసి అతడిని గొడ్డలి, ఇనుపరాడ్లతో కొట్టారు. దీంతో భిక్షపతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.