: కాంగ్రెస్ గురించి మాట్లాడినా చాలు.. మహాపాతకాలు చుట్టుకుంటాయి: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీని చూసి చిన్నపిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారని టీఎస్ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ గురించి మాట్లాడినా మహాపాతకాలు చుట్టుకుంటాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యిమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. నీటితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మిన కేసీఆర్... మిషన్ కాకతీయ పథకం ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను చేపట్టారని తెలపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడమే కాకుండా... మరిన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టారని చెప్పారు.