: మొదట్లో పిచ్చోడన్నారు, కాళ్లు విరిగాయి, గాయాలయ్యాయి... ఇప్పుడు అతనిని దేవుడు అంటున్నారు!
'మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు' అంటూ ఒక సినీ కవి చెప్పిన మాటలు చైనాకు చెందిన ఝంగ్ జివెన్ కు అక్షరాల సరిపోతాయి. ఒకప్పుడు అతన్ని సొంత ఊరి ప్రజలు పిచ్చోడన్నారు. నీవల్ల కాదని నిరుత్సాహపరిచారు. లక్ష్యసాధనలో వినికిడి సమస్యతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఒకసారి కాలు కూడా విరిగిపోయింది. అయినా వెనకడుగు వేయలేదు...అంతా పూర్తయిన తరువాత అతనిని దేవుడు అని వారే కీర్తిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చైనాలోని ఫులింగ్ అడవుల్లోని ఓ మారుమూల గ్రామంలో ఝంగ్ జివెన్ పుట్టి పెరిగాడు.
అనంతరం ఆ గ్రామానికి సమీపంలోని చంగ్ పింగ్ అనే పట్టణంలో స్థిరపడ్డాడు. జీవితం బాగానే సాగిపోతోంది. ఒకసారి ఊరు వచ్చిన ఝంగ్ జివెన్...తన గ్రామంలోని చిన్నారులు చదువుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడడం గుర్తించాడు. చదువుపై ఆసక్తి ఉన్న పలువురు విద్యార్థులు ప్రమాదకరమైన కొండ, కోనల మార్గంలో ప్రయాణించాల్సి వస్తోందని తెలుసుకున్నాడు. దీంతో తమ గ్రామాన్ని ఈ సమస్య నుంచి దూరం చేయాలని భావించాడు. దీంతో వారికోసం ఎలాంటి ఇబ్బందులు లేని రహదారిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
అయితే కొండ మార్గం కావడంతో రోడ్డు వేడయం ఎలాగా అని ఆలోచించాడు. తర్వాత రహదారి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. తాను నిర్మిస్తున్న రహదారి మార్గంలో లభించే వనరులను వినియోగిస్తూ 2012లో మార్గం వేయడం ప్రారంభించాడు. అతని ప్రయత్నాన్ని చూసి అంతా నవ్వారు. 'నీకెందుకీ పని? హాయిగా విశ్రాంతి తీసుకోక' అంటూ పలువురు నిరుత్సాహపరిచారు. మరికొందరు పిచ్చోడన్నారు. అప్పటికే అతనికి వినికిడి సమస్య ఉండడంతో కొండపై నుంచి కిందపడే రాళ్ల వల్ల చాలా సార్లు గాయపడ్డాడు. ఒకసారి పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చి గాయపర్చడంతో అతని కాలు విరిగిపోయింది. అయినా సరే పట్టు వదల్లేదు. లక్ష్యాన్ని మరువలేదు.
ప్రదేశాన్ని బట్టి రాళ్లు, మట్టి, కర్రలు ఇలా అవకాశమున్న ప్రతిదానిని వినియోగించుకుని చక్కని మార్గాన్ని నిర్మించాడు. అంతేకాదు, కొండ మార్గం కావడంతో మెట్ల మార్గం పక్కనే బారికేడ్ (రెయిలింగ్) ను కూడా ఏర్పాటు చేశాడు. మార్గమధ్యంలో విశ్రాంతి కోసం అక్కడ దొరికే కర్రలసాయంతో కుర్చీలు ఏర్పాటు చేశాడు. మరికొన్ని చోట్ల ఎండ, వర్షం బారిన పడకుండా రక్షణకు షెడ్లు ఏర్పాటు చేశాడు. ఇలా సుమారు ఐదేళ్లు శ్రమించి, గ్రామస్తుల రాకపోకలకు అనువుగా ఉండే చక్కని మార్గాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు అక్కడి వారంతా అతనిని దేవుడు అని, మహానుభావుడని కీర్తిస్తున్నారు.