: జియోకు పోటీ.. వీవోఎల్టీఈ సర్వీసుల ప్రారంభానికి సిద్ధమవుతున్న టాప్-3 టెల్కోలు
రిలయన్స్ జియో దెబ్బతో కకావికలైన టాప్ 3 టెల్కోలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు త్వరలో వీవోఎల్టీఈ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ సర్వీసుల ద్వారా మాత్రమే జియోకు అడ్డుకట్ట వేయవచ్చని భావించిన కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి వీవోఎల్టీఈ సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. తమ వినియోగదారులు జియోకు మళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని భావిస్తున్న సంస్థలు ప్రస్తుత సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసి జియో కంటే మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నాయి.
వీవోఎల్టీఈ ద్వారా డేటా ఫార్మాట్లో వాయిస్ కాల్స్ ఉచితంగా అందుతాయని, అందుకే దానికి అంత ప్రాధాన్యం ఏర్పడిందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ వాయిస్ కాల్స్‌తో పోల్చుకుంటే వీవోఎల్టీఈ ద్వారా అతి చవకగా కాల్స్ చేసుకోవచ్చని చెబుతున్నారు. వీవోఎల్టీఈని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లు మార్కెట్లో చవగ్గా అందుబాటులోకి రాగానే తమ సర్వీసులను ప్రారంభించేందుకు ఈ మూడు టెల్కోలు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్టెల్ ముంబై, ఢిల్లీలలో వీవోఎల్టీఈ సర్వీసులకు కమర్షియల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. త్వరలోనే దేశమంతా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. వొడాఫోన్ ఇప్పటికే బేసిక్ ట్రయల్స్ పూర్తి చేసి లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండో త్రైమాసికంలో వీవోఎల్టీఈ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఐడియా సెల్యూలార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తెలిపారు. సో.. టెలికం రంగంలో మరో పోటీకి తెరలేస్తోందన్నమాట.