: ఇక ఉపేక్షించను... అటవీశాఖ తీరుపై చంద్రబాబు ఆగ్రహం!


ఏపీలో అటవీశాఖ పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అటవీశాఖ అధికారులు బాధ్యత లేకుండా పని చేస్తున్నారని, శాఖాపరమైన సంస్కరణలు చేపట్టాలని పలుసార్లు ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎన్నిసార్లు ఆదేశించినా అటవీశాఖాధికారులు పెడచెవిన పెడుతున్నారని, లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని, ఇదే తీరు కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనని హెచ్చరించారు.

కాగా, రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతి, రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళదామని, 2022 నాటికి అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఏపీ ఉండాలని, 2029 నాటికి ఏపీ అగ్రస్థానంలో ఉండాలని, 2050 నాటికి అత్యుత్తమ కేంద్రం ఏపీ ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

 ఆనందంతో కూడిన అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, విభజన మరిచిపోకూడదనే నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నామని చెప్పారు. టెక్నాలజీని వినియోగించుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాది ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. కాగా, ‘పీపుల్స్ ఫస్ట్’ పేరుతో కాల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. కాల్ సెంటర్ నెంబర్ 1100 గా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News