: ప్రస్తుతానికి బీజేపీలో చేరే ఆలోచన లేదు: ఆర్. కృష్ణయ్య
ప్రస్తుతానికి బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. అమరావతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కృష్ణయ్య సహా పదమూడు జిల్లాల బీసీ సంఘాల నేతలు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను టీటీడీపీ మహానాడు సభలకు ఎన్నడూ వెళ్లలేదని, వెళ్లే అలవాటు తనకు లేదని చెప్పారు. బీసీ సమస్యలపై ప్రస్తుతం పోరాడుతున్నానని, చట్ట సభల్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సీట్లు కేటాయించేలా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ వ్యక్తి ప్రధానిగా ఉండటంతో, బీజేపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందని ఆశిస్తున్నామని, జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడంపై అమిత్ షాకు ఆయన తన కృతఙ్ఞతలు తెలిపారు.