: కేంద్రం నిధులు పిట్ట రెట్టతో సమానమా? ఇంత పరేషాన్ ఎందుకు?: లక్ష్మణ్ సూటి ప్రశ్న
మూడు రోజుల పాటు నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన పర్యటన విజయవంతం అయిందని, ఆయనకు వచ్చిన ప్రజా మద్దతు చూసి సీఎం కేసీఆర్ పరేషాన్ అవుతున్నారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అమిత్ షా పర్యటనతో తమ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా టీఆర్ఎస్ భావిస్తోందని నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, సెప్టెంబరులో మరోసారి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని తెలిపారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణం నుంచి పేదలకు పెన్షన్లు, రేషన్ వరకూ ఎన్నో పథకాలు కేంద్రం ఇస్తున్న నిధులతోనే అమలవుతున్నాయని, ఈ విషయాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిధులు పిట్ట రెట్టతో సమానమని కేసీఆర్ వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు. కేంద్రం నుంచి నిధులు లేకుంటే, ఒక్క పథకమూ అమలు కాదని అన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల నిధులు ఇస్తుంటే, కేసీఆర్ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం, పన్నుల వాటా కింద రూ. 96 వేల కోట్లు అందుతాయన్న విషయాన్ని బహిరంగంగా అంగీకరించే ధైర్యం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుకా కేంద్రం అండదండలు, ఇస్తున్న నిధులు ఉన్నాయని అన్నారు.