: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ కే కన్నమేసిన దొంగలు!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. అనుమానిత వస్తువులన్నింటినీ కస్టమ్స్ విభాగం అధీనంలో భద్రపరుస్తారు. అయితే ఇలా కస్టమ్స్ అధీనంలో భద్రపరిచే బంగారానికి భద్రత లేకుండా పోయిందని తెలుస్తోంది. తాజాగా కస్టమ్స్ అధికారులు జప్తు చేసిన వస్తువులను భద్రపరిచే కార్యాలయం నుంచి 15.9 కేజీల బంగారం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 4 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ ఆధ్వర్యంలోని తనిఖీల కమిటీ తెలిపింది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 21 మధ్య కస్టమ్స్ నిల్వల నిర్ధారణకు ఒక కమిటీ వచ్చిన సందర్భంగా ఈ దొంగతనం విషయం వెలుగు చూసింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు, దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. గతంలో ఈ కార్యాలయం నుంచి 38 కేజీలకుపైగా బంగారం మాయమైనట్టు తెలుస్తోంది.