: తెలంగాణ ఫైబర్-గ్రిడ్ ప్రాజెక్టులో నోకియా.. కేటీఆర్‌తో అమెరికాలో చర్చలు
తెలంగాణ ఫైబర్-గ్రిడ్ ప్రాజెక్టులో పాలు పంచుకునేందుకు ఫిన్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ నోకియా ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను బుధవారం నోకియా సహా పలు కంపెనీల ఉన్నతాధికారులు కలిసి పలు విషయాలపై చర్చించినట్టు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. నోకియా సీనియర్ అధికారి ఒస్వాల్డో డి కాంప్లితో కాలిఫోర్నియాలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టనున్న హైలెవల్ ఫైబర్-గ్రిడ్ ప్రాజెక్టు గురించి వివరించారు. దీంతో స్పందించిన నోకియా ప్రతినిధి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని కోరారు. ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. ఫైబర్-గ్రిడ్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే.