: కశ్మీరీని ఆ రోజు నా జీపుకు ఎందుకు కట్టేయాల్సి వచ్చిందంటే...!: మేజర్ లీతుల్ గొగోయ్ వివరణ
కశ్మీరీని మానవ కవచంగా జీపు ముందు భాగానికి కట్టి తీసుకెళ్లిన మేజర్ లీతుల్ గొగోయ్‌ని సైన్యం ప్రతిభా పురస్కారంతో సత్కరించిన సందర్భంగా ఏప్రిల్ 9న తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒక టీవీ ఛానెల్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఏప్రిల్ 9న జమ్ముకశ్మీర్ లోని బుద్గాం పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతను పరిశీలించాల్సిందిగా నాకు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే అక్కడకి వెళ్లాను. అయితే నేను వెళ్లేసరికే అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. పోలింగ్ బూత్ పై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. సుమారు 1200 మంది ఆందోళనకారులు పోలింగ్ స్టేషన్ ను చుట్టుముట్టారు. చిన్నా, పెద్దా, మహిళలు అనే తేడా లేకుండా పోలింగ్ బూత్ ను చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపిస్తూ, పెట్రోల్ బాంబులు వేసి తగులబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆందోళనకారులను నిలువరించే మార్గం, తరుణం కూడా కనిపించలేదు. ఇంతలో నా జీపుకు 30 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు. అంతే.. నా బుర్రలో ఉపాయం వెలిగింది. అతడ్ని పట్టుకుని రమ్మని నా సిబ్బందికి చెప్పాను. వారు అతనిని తీసుకురాగానే...అతన్ని నా జీపు ముందు భాగంలో కట్టేశాను...ఆ జీపులో పోలింగ్ సిబ్బందిని తరలించాను. ఆ రోజు నేను అలా చేయకుంటే.... ఆందోళనకారుల దాడిలో కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు’ అని ఆయన ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన ఆ సాహసోపేతమైన చర్యతో పాటు ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకు కమాండేషన్ కార్డ్ అందించిన సంగతి తెలిసిందే.