: పాకిస్థాన్ ను శిక్షించేందుకు ఉరకలేస్తున్న ఇండియా: యూఎస్ ఇంటెలిజన్స్ చీఫ్


ప్రపంచదేశాల ముందు దౌత్యపరంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేసే దిశగా విజయవంతమైన అడుగులు వేస్తున్న ఇండియా, ఆ దేశాన్ని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా భావిస్తోందని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ విన్సెంట్ స్టెవార్ట్ వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ నుంచి మద్దతు లభిస్తుందన్న ఆరోపణలతోనే భారత్ చర్యలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని శక్తిమంతమైన కమిటీల్లో ఒకటైన సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ముందు మాట్లాడిన ఆయన, పాకిస్థాన్ సైతం వెనక్కు తగ్గే ఆలోచనలో లేదని తెలిపారు. కాగా, వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ పోస్టులపై తాము దాడులు చేశామని చెబుతూ, భారత సైన్యం ఓ వీడియోను విడుదల చేసిన మరుసటి రోజే విన్సెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇక భారత్ తన సైన్యాన్ని ఆధునికీకరించే పనిలో నిమగ్నమైందని, సరిహద్దులతో పాటు హిందూమహా సముద్ర ప్రాంతంలో తన ప్రయోజనాలను పరిరక్షించుకునే లక్ష్యాలను నిర్దేశించుకుందని విన్సెంట్ తెలిపారు. కాశ్మీరులో హింస కొనసాగుతోందని, ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతూ, గతంలో ఎన్నడూ లేనంత కింది స్థాయికి భారత్, పాక్ మధ్య బంధం పడిపోయిందని విన్సెంట్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు ఇండియాలో పెరిగిపోవడంతో, అందుకు దీటైన సమాధానాన్ని చెప్పాలన్న ఒత్తిడి ప్రజల నుంచి వస్తోందని, అందుకు తగ్గట్టుగానే సైన్యం కదులుతోందని అన్నారు. ఇదే సమావేశంలో ఇండియాతో చైనా సంబంధాలు, ఇస్లామిక్ ఉగ్రవాదం, ఉత్తర కొరియా దూకుడు తదితర అంశాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News