: ఇంట్లో ఉంచిన 4,70,000 రూపాయల విలువైన కరెన్సీ నోట్లను చించేసిన బుడతడు!
తన కుమారుడిని ఇంట్లో విడిచి వెళ్లిన ఓ తండ్రి మళ్లీ తిరిగి ఇంటికి వచ్చి చూసి షాక్ తిన్నాడు. తన కుమారుడు చేసిన పనికి తాను ఆశ్చర్యపడాలో.. బాధ పడాలో.. కోపం తెచ్చుకోవాలో అతడికి తెలియలేదు. తాను ఇంట్లో దాచి పెట్టిన లక్షల కొద్దీ నగదును ఆ చిన్నారి చించేశాడు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావోలో ఈ ఘటన చోటు చేసుకుంది. గావ్ అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడు నగదునంతా చించేయడం చూసి ఆ చినిగిన డబ్బుని తీసుకొని బ్యాంకుకు పరుగులు తీశాడు. మొత్తం 50 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో 4,70,000 రూపాయల నగదును తన కొడుకు ఇంట్లో ఆడుకుంటూ చించేశాడని చెప్పాడు. దానిని ఎక్స్చేంజ్ చేయమని కోరాడు.
అయితే, అందులో ఎన్నో నోట్లు నెంబర్లు కూడా కనిపించకుండా చిరిగిపోవడంతో వాటిని తీసుకోబోమని బ్యాంకు సిబ్బంది చెప్పారు. వ్యాపారం చేయడం కోసం క్రెడిటర్ల దగ్గర్నుంచి తీసుకున్న ఆ నగదును ఇంట్లో ఉంచుకున్న ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ డబ్బు చెల్లకుండా పోయింది. ఇందులో తన కొడుకు తప్పు ఏమీలేదని, తెలియనితనంతోనే ఆ డబ్బంతా చించేశాడని గావ్ చెప్పాడు.