: తెలంగాణలో మరో కొత్త పార్టీ... జూన్ 2న హైదరాబాద్ లో ఆవిర్భావ సభ
తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని తెలంగాణ ఉద్యమ వేదిక పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... వచ్చే నెల 2న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఆవిర్భావ సభ ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యమ బాహుబలి సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి పోరాడిన ఉద్యమకారులను టీఆర్‌ఎస్ నుంచి గెంటివేశారని, ఉద్యమ ద్రోహులను చేర్చుకున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు.
తెలంగాణ సాధన కోసం సీమాంధ్ర పాలకులపై సాగించిన పోరాటాన్ని తాము ఎన్నటికీ మరచిపోలేమని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తులకు అధికారం వచ్చేంత వరకు మరో ఉద్యమం చేస్తామని సుధాకర్ చెప్పారు. కేసీఆర్ చెబుతున్న మాటలను వింటూ భ్రమల్లో బతకడం కంటే స్వేచ్ఛగా పోరాటం చేసే తమ పార్టీలోకి అందరూ రావాలని ఆయన కోరారు.