: హీరో నాగార్జున క్షమాపణ చెప్పాల్సిందే.. యాంకర్ రవి కనబడితే కాళ్లు విరగ్గొడతాం: మహిళా నేత సజయ
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున క్షమాపణ చెప్పాల్సిందే అని మహిళా ఉద్యమకారిణి సజయ డిమాండ్ చేశారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో వేడుక సందర్భంగా మహిళల మనోభావాలు దెబ్బతినేలా చలపతిరావు మాట్లాడారంటూ మహిళా సంఘాల నేతలు ఈ రోజు హైదరాబాదు, జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సజయ మాట్లాడుతూ, చలపతిరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే వ్యాఖ్యలు యువతపై చాలా ప్రభావం చూపుతాయని అన్నారు. చలపతిరావు వ్యాఖ్యల తర్వాత యాంకర్ రవి 'సూపర్ సార్' అంటూ గట్టిగా అరిచాడని... రవి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. తన కుమారుడి సినిమా ఫంక్షన్ లో ఇలా జరిగినందుకు, ఈ సినిమాకు నిర్మాత అయినందుకుగాను నాగార్జున బాధ్యత వహించాలని... బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.