: కొడుకు రోగాన్ని నయం చేస్తానని తల్లిపై అత్యాచారం.. డబ్బు, నగలతో పరారీ.. జ్యోతిష్యుడి అరెస్ట్
కుమారుడి రోగాన్ని నయం చేస్తానని చెప్పి తల్లిని నమ్మించి ఆపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిష్యుడిని బెంగళూరు పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. వారి కథనం ప్రకారం.. విజయనగరలో నివసించే ఓ మహిళ (35)కు పది నెలల బాబు ఉన్నాడు. చిన్నారిలో అప్పుడప్పుడు మూర్ఛ రోగ లక్షణాలు కనిపిస్తుండడంతో సమీపంలో ఉంటూ జ్యోతిష్యం చెప్పే ప్రసన్నకుమార్ అలియాస్ కార్తీక్‌ను ఆశ్రయించింది.
చిన్నారి మూర్చ రోగాన్ని నయం చేస్తానని నమ్మించిన ఆయన ఆమెలో శారీరక లోపమే ఇందుకు కారణమని నమ్మించాడు. అందులో భాగంగా ఆమె నగ్న ఫొటోలను తీశాడు. తనతో గడిపితే దోషం పోయి బాబు మూర్ఛ తగ్గుతుందని నమ్మించి ఆమెపై ఏడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు డబ్బు, బంగారం దానం చేస్తే బాబు మామూలు మనిషి అవుతాడని చెప్పి ఆమె నుంచి రెండు బంగారు నెక్లెస్‌లు, రెండు చైన్లు, ఆరు చెవికమ్మలు, మూడు ఉంగరాలను లాక్కున్నాడు. వీటితోపాటు రూ.20.7 లక్షల నగదు కూడా వసూలు చేశాడు. అనంతరం పరారయ్యాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన మహిళ వారం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం వేట సాగించిన విజయనగర పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేసి పలు కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు.