: కర్నూలులో పరిస్థితులను గవర్నర్ కు వివరించా: వైఎస్ జగన్
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ రోజు కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా అవహేళన చేస్తున్నారో చెప్పామని, ప్రలోభాలకు లొంగకపోతే మనుషులను చంపే ప్రభుత్వ తీరును వివరించామని అన్నారు. నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడన్న భయంతోనే అతి కిరాతకంగా హత్య చేశారని, ఆయన గన్ లైన్స్ రెన్యువల్ చేయాలని కోరితే పోలీసులు పట్టించుకోలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నారాయణరెడ్డి గన్ ను సరెండర్ చేసుకుని మళ్లీ వెనక్కి ఇవ్వలేదని అన్నారు.
లైసెన్స్ వెపన్ లేకుండా చూసి కుట్ర చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని, కోర్టులు కూడా జోక్యం చేసుకుని కేఈ తనయుడిపై కేసు వేయాలని ఆదేశించాయని జగన్ అన్నారు. నారాయణరెడ్డిని పథకం ప్రకారం కల్వర్టు వద్ద ట్రాక్టర్లతో దాడి చేసి చంపేశారని, హత్య జరిగిన కొన్ని గంటల వరకు కూడా పోలీసులు చేరుకోలేదని, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసమే పోలీసులు ఆలస్యంగా వచ్చారని ఆరోపించారు. ఒకవైపు అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, మరోవైపు ప్రలోభాలకు లొంగకపోతే దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.