: ఆస్పత్రి బెడ్‌పై భర్త.. ఐసీయూలో చితక్కొట్టుకున్న భార్యలు!
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా.. అన్నాడో కవి. దానిని నిజం చేశారు ఇద్దరు సతులు. ఇంట్లో నిత్యకృత్యమైన వారి పోరును పడలేక భర్త ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతుంటే, అక్కడికొచ్చి దానిని కూడా రణరంగంగా మార్చేశారీ పడతులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన షాబాద్ అలీ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత ప్రేమలతతో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఓవైపు వీరి ప్రేమ కొనసాగుతుండగానే షాబాద్‌కు అస్మా అనే మరో యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు.
షాబాద్ జీవితం సాఫీగా ముందుకు సాగుతున్నప్పటికీ ప్రేమలతపై ఉన్న ప్రేమను వదులుకోలేకపోయాడు. ఇద్దరు తరచూ కలుసుకునేవారు. విషయం తెలిసిన ఆస్మా ప్రేమలత, షాబాద్ లను పలుమార్లు నిలదీసింది. అయినా వారిలో మార్పు కనిపించలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రేమలత తన భర్తను వదిలేసి నేరుగా షాబాద్ వద్దకు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో గొడవలు మరింత ముదిరాయి. అస్మా, ప్రేమలత మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి.
ఇంట్లో భార్యల గొడవ భరించలేని షాబాద్ ఇటీవల విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక్కడికి వరకు బాగానే ఉన్నా.. ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న భర్తను దగ్గరుండి చూసుకునేందుకు అతడి భార్యలు ఇద్దరూ తరచూ వచ్చేవారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఒకరికొకరు తారసపడ్డారు. అంతే.. ఆస్పత్రిని రణరంగంగా మార్చేశారు. ఐసీయూలో జుట్లు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. కళ్లముందే కలబడుతున్న భార్యలను నిలువరించే ప్రయత్నంలో అతడి సెలైన్ పైపు ఊడిపోయింది. వారి అరుపులకు అక్కడికి చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. వారి పోట్లాట సీన్ ఆస్పత్రిలోని సీసీకెమెరాలో రికార్డు కాగా, అది కాస్తా తాజాగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది.