: అబ్దుల్ కలాంకు నాసా అరుదైన గౌరవం.. కొత్త జీవకణానికి మిసైల్ మ్యాన్ పేరు
భారత మాజీ రాష్ట్రపతి, అణుశాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. భూమికి నాలుగు వందల కిలోమీటర్ల పైన తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో కనుగొన్న ఓ కొత్త జీవకణానికి ఆయన పేరు పెట్టింది. ఇప్పటి వరకు ఇటువంటి జీవకణం భూమిపై కనిపించలేదు. ఐఎస్ఎస్‌లోని ఫిల్టర్‌పై 40 నెలల క్రితం గుర్తించిన ఒకరకమైన ఈ బ్యాక్టీరియాకు కలాం పేరు వచ్చేలా సోలిబాసిల్లస్ కలామి అని పేరు పెట్టినట్టు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ తెలిపారు. ఇప్పటి వరకు బ్యాక్టీరియా భూమిపై కనిపించనప్పటికీ ఇది భూమికి వెలుపల ఉన్న జీవరాశి కాదని, భూమి నుంచి ఐఎస్ఎస్‌కు చేరిన సరుకుల ద్వారా ఇది చేరి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నట్టు తెలిపారు.