: భారత్ చాలా పెద్ద తప్పు చేసింది... ఈ అవకాశాన్ని పాక్ అందిపుచ్చుకుంటుంది: మార్కండేయ కట్జూ


భారతదేశం చాలా పెద్ద తప్పు చేసిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా పాకిస్థాన్ కు భారత్ అనవసరంగా అవకాశం ఇచ్చిందని అన్నారు. ఈ ఒక్క చర్యతో పాక్ ఆశలు సజీవంగా నిలిచాయని ఆయన అన్నారు. సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించని భారత్, వివిధ అంశాల్లో పాక్ ను సమర్ధవంతంగా అడ్డుకుందని ఆయన పేర్కొన్నారు. దీంతో మూడో దేశం కానీ, ఇతర సంస్థలేవీ సున్నితమైన అంశాలపై స్పందించే సాహసం చేయలేదని అన్నారు. తాజాగా భారత్ కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా పాక్ కు ద్వారాలు తెరుచుకున్నాయని, ఇకపై ప్రతి అంశానికి వారు అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తడతారని ఆయన అభిప్రాయపడ్డారు.

 అలాంటప్పుడు ప్రతిసారి భారత్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని, ఇది భారత్ కు తలనొప్పి వ్యవహారంగా మారుతుందని ఆయన తెలిపారు. ఒక్క వ్యక్తి జీవితాన్ని కాపాడేందుకు భారత్‌ చేసిన ఈ ప్రయత్నంతో కశ్మీర్‌ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై పాక్ ఐసీజేకు వెళుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై భారత్ లో చాలా మంది సంబరాలు చేసుకుని ఉండవచ్చు కానీ... ఎన్నో విషయాలపై పాక్ ఇప్పుడు ఐసీజేకి వెళ్లే అవకాశం కల్పించిందని అన్నారు. కశ్మీర్‌ విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థను, వ్యక్తులను ఇ‍ప్పటి వరకు అనుమతించని మనం ఇప్పుడు పాక్‌ ఐసీజేకు వెళ్తే దాని జోక్యానికి అంగీకరించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఇప్పుడు పాక్ చాలా సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు. ఒక్క కుయుక్తితో పాక్, భారత్ ను తప్పటడుగు వేసేలా చేసిందని ఆయన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News