: ఆమె అలా చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది: శశిథరూర్


కేరళలోని కొల్లాంలో స్వామిజీ ముసుగులో పక్షవాతం బారిన పడిన తండ్రిని బాగుచేస్తానన్న మిషతో గత ఎనిమిదేళ్లుగా తనపై అత్యాచారానికి ఒడిగడుతున్న గంగేశానంద తీర్థపాద (54) అలియాస్‌ హరిస్వామి అనే దొం‍గ స్వామిపై తిరగడబడి అతని జననాంగాన్ని తిరువనంతపురానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (23) కోసేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆమెపై అభినందనలు కురుస్తున్నాయి. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెను అభినందించారు.

అయితే కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ మాత్రం ఆమె ధైర్యాన్ని అభినందిస్తూనే, అలా చేయకుండా ఉండాల్సిందని సూచించారు. ఆమె అలా చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని చెప్పారు. ‘అంత వేగంగా స్పందించి ఆమె చేసిన పనికి కొంత సంతోషపడవచ్చు. కానీ, చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోవడం కంటే పోలీసులను ఆశ్రయిస్తే బాగుండేది’ అని అన్నారు. ఆమె పట్ల తనకు సానుభూతి ఉందని, తనలాగే చాలా మందికి ఆమె పట్ల సానుభూతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆమె చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కత్తితో సమాధానం వెతుక్కోవాలని భావించకూడదని ఆయన హితవు పలికారు. 

  • Loading...

More Telugu News