: మోదీని అరెస్టు చేయిస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు: ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైసీపీ అధినేత జగన్ కలిసిన విషయంపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం వెనుక వారికి ఏదో భయం పట్టుకున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామన్నారని పేర్కొన్నారు. గతంలో గోద్రా అల్లర్లు జరిగిన అనంతరం మోదీ దేశ పర్యటన చేస్తున్నప్పుడు, ఆయన హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తామని 2003 ఆగస్టు 27న చంద్రబాబు ప్రకటించారని ఉండవల్లి చెప్పారు.
అదే విషయాన్ని ప్రధాని మోదీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకున్నారేమోనని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు తనకు అనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. అవినీతి, ఓటుకు నోట్లు వంటి కేసుల నేపథ్యంలో మోదీ తనపై చర్యలు తీసుకుంటారేమోనని చంద్రబాబుకి భయమేస్తోందని ఆయన ఆరోపించారు. రానున్న కాలంలో మోదీ, జగన్ కలిసి ముందుకు వెళతారేమోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతూ జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.