: పట్టపగలే రౌడీని వెంటాడి.. మారణాయుధాలతో నరికి చంపేశారు!
సినిమా సీనుని తలపించేలా ఓ వ్యక్తిని పలువురు దుండగులు పట్టపగలే వెంటాడి, తరిమి మారణాయుధాలతో నరికి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అనుప్పాణడి ప్రాంతానికి చెందిన ఆర్ముగమ్ (24) అనే ఓ రౌడీ.. ఓ హత్య కేసులో అరెస్టయి ఇటీవల జామీనుపై బయటికి వచ్చాడు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్ముగమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బయటకు రావాల్సిందిగా అందులో కోరారు. అనంతరం ఓ ద్విచక్ర వాహనంపై ఆర్ముగమ్ పాత రామనాథపురం వైపు వెళుతున్నాడు. అదే సమయంలో అతడి బైక్ వెనుక మరో బైక్ వచ్చింది. దానిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో కనిపించారు.
దీంతో తన బైక్ను విడిచి పరుగులు తీశాడు ఆర్ముగమ్. కొంత దూరం వెంటపడి ఎట్టకేలకు అతడిని పట్టుకున్న దుండగులు అతి కిరాతంగా నరికేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆ యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.