: హడావుడిగా, వేగంగా తింటున్నారా? అయితే ప్రమాదమేనంటున్న వైద్యులు
బిజీబిజీ లైఫ్‌లో ఏది పడితే అది తినేసి, హడావుడిగా బయటకు వెళ్లిపోతుంటారు కొందరు. మరి కొందరు టైమ్ వేస్ట్ కాకూడదంటూ గబగబా ఆహారాన్ని నోట్లో కుక్కేసి సరిగా నమలకుండానే మింగేస్తుంటారు. ఇదే అంశంపై వైద్యులు మాట్లాడుతూ అలా తొందరగా ఆహారం తినడానికి బాల్యం నుంచీ అదో అలవాటుగా ఉండడం కూడా ఓ కారణమని చెప్పారు. ఇటువంటి అలవాటు వల్ల చిక్కులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎంత వేగంగా తింటే అన్ని ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళతాయని చెబుతున్నారు. మనిషి వేగంగా తినే సమయంలో ఆహారం ఇక చాలని సంకేతాలు పంపే మెదడులోని ఒక భాగం గుర్తించలేకపోతుందని, దీంతో మన అవసరానికి మించి కాలరీలు కడుపులోకి వెళతాయని చెప్పారు.
దీంతో స్థూలకాయం వస్తుందని, ఒక వ్యక్తి 400 కాలరీలు తినే కాలంలో వేగంగా తినే మరో వ్యక్తి 800 కాలరీల వరకు తినడమే అందుకు కారణమని తెలిపారు. ఆహారాన్ని వేగంగా తినే అలవాటు ఉంటే దాన్ని నెమ్మదిగా తగ్గించాలని, ప్రతి ముద్దనూ బాగా నమిలి మింగాలని తెలిపారు. ఇలా చేస్తేనే ఆహారం తీసుకునే వేగం బాగా తగ్గుతుందని, తిన్న భోజనం సరిగా జీర్ణమవుతుందని, ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఆహారంలోని రసాల్ని పీలుస్తూ, అందులోని రుచిని బాగా ఆస్వాదించాలని వైద్యులు చెబుతున్నారు. అంటే తింటున్న సమయంలో భోజనం మీదే 100శాతం దృష్టి ఉంచాలని చెబుతున్నారు. అలా చేయడం మీ వల్ల కాలేకపోతే, భోజనం చేసే చేయిని మార్చాలని, కొన్ని రోజులు కుడిచేతితో భోజనం చేసే వాళ్లు స్పూన్ ఉపయోగిస్తూ ఎడమ చేతితో తినాలని చెప్పారు. ఈ టెక్నిక్‌తో దృష్టిని ఆహారంలోనే ఉండేలా చేయవచ్చని తెలిపారు.