: ఆ గ్రామ పాఠశాలలోని పిల్లలందరి పుట్టినరోజు తేదీ జనవరి ఒకటే.. ఆధార్ కార్డులు చూసి టీచర్స్ షాక్
తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుకుంటున్న అందరు విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులందరూ తమ తమ ఆధార్‌కార్డుల జిరాక్సులను పాఠశాలల్లో ఇస్తున్నారు. అయితే, అలహాబాద్ సమీపంలోని కంజాసా గ్రామంలో పిల్లల నుంచి ఆధార్ కార్డు వివరాలు తీసుకున్న ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే, ఆ గ్రామంలో పిల్లలందరి పుట్టిన తేదీ జనవరి 1గానే నమోదైంది. దీనిపై ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.
కంజాసా గ్రామంలో మొత్తం 10 వేల మంది ప్రజలు ఉంటారు. ఆధార్ కార్డు పొందేందుకు ఎక్కువ కాలం ఎదురు చూడలేక, వారంతా తమ తమ పుట్టిన తేదీలను జనవరి 1గా నమోదు చేయించుకున్నారు. దీంతో వారందరికీ అలాగే ఆధార్‌కార్డులు వచ్చేశాయి. ఏకంగా 10 వేల మంది జనవరి 1నే పుట్టినట్లు ఆధార్ కార్డులు జారీ చేసే సిబ్బంది ముద్రించారు.