: మేం మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికీ తెలిసిందే!: గొట్టిపాటి


ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. ఈ దాడుల్లో ఎమ్మెల్సీ కరణం బలరాం అనుచరులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ పై బలరాం నిప్పులు చెరిగారు. టీడీపీలో చేరిన గొట్టిపాటి... కోవర్ట్ రాజకీయాలు చేస్తూ హత్యారాజకీయాలకు తెరలేపాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలను గొట్టిపాటి ఖండించారు. ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి దాకా మూడుసార్లు తాను ఎమ్మెల్యే అయ్యాయని... ఇలాంటి హత్యారాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తనకు గాని, తన కుటుంబానికి కాని ఎప్పుడూ లేదని అన్నారు. గ్రామంలో జరిగిన ఘటనతో తాము కూడా చాలా బాధగా ఉన్నామని... కొత్తగా టీడీపీలోకి వచ్చిన తాము అందరినీ కలుపుకుని పోయే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు.

గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులను తీసుకొచ్చి తమ మీద రుద్దడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికి తెలిసిందేనని... తమపై అనవసరంగా నిందలు వేయడం తగదని సూచించారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి హత్యారాజకీయాలను ఎప్పుడైనా చేశానేమో ఎవర్నైనా అడిగి తెలుసుకోండని అన్నారు. తాము హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని... జరిగిన విషయం మొత్తాన్ని ఆయన దృష్టికి తీసుకెళతానని తెలిపారు.

  • Loading...

More Telugu News