: కన్నకూతురుకి గర్భసంచి దానం చేసిన తల్లి!
ప్రతి స్త్రీ తాను ‘అమ్మ’ కావాలని కోరుకుంటుంది. అయితే, తన కూతురు ఇక తల్లి కాలేదని తెలుసుకున్న ఓ అమ్మ చలించిపోయింది. గర్భసంచి లేకుండా పుట్టిన కూతురికి తన గర్భసంచిని దానం చేసి ‘అమ్మ’దనాన్ని గొప్పగా చాటుకుంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, దేశంలోనే మొట్టమొదటిసారిగా గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్సగా ఈ కేసు రికార్డులకు ఎక్కడం. గర్భసంచి దానం చేసిన తల్లి వయసు 43 కాగా, ఆమె కూతురి వయసు 21 సంవత్సరాలు.
మహారాష్ట్రలోని పుణెలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్స చేసింది. ఈ శస్త్రచికిత్సకు మొత్తం తొమ్మిది గంటల సమయం పట్టింది. చాలా శ్రమించి ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ మాట్లాడుతూ, గర్భసంచికి చాలా పెద్ద సంఖ్యలో రక్తనాళాలు కలిసి ఉంటాయని, అలాగే చిన్న చిన్న నరాలు కూడా ఉంటాయని, వాటన్నింటిని కొత్తగా గర్భసంచికి కలపడం సాంకేతికంగా చాలా కష్టమని వివరించారు. ఇరవై ఒక్క సంవత్సరాల ఆ యువతికి ఈ గర్భసంచిని అమర్చినప్పటికీ, ఆమె శరీరం దానికి అలవాటు పడేందుకు ఒక ఏడాది పడుతుందని, ఆ తర్వాతే ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చేందుకు ప్రయ్నత్నించాలని శైలేష్ సూచించారు.
అమ్మ కావాలన్న ఆ యువతి కల నెరవేరేందుకు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా, మనదేశంలో గర్భసంచి మార్పిడి శస్త్ర చికిత్స చేయడం ఇదే ప్రథమం కాగా, ప్రపంచంలో ముప్పయ్యవది. అమెరికా, బ్రెజిల్, స్వీడన్, చైనా, జర్మనీ, సెర్బియా, చెక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, టర్కీ దేశాల్లో కూడా ఈ తరహా ప్రయత్నాలు జరిగాయి. కానీ, స్వీడన్ లో మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. అక్కడి యూనివర్శిటీ ఆఫ్ గోథెన్ బర్గ్ లో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ మాట్స్ బ్రాస్ స్ట్రామ్ నేతృత్వంలో ఈ చికిత్సను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చేశారు. ఇలాంటి చికిత్సల ద్వారా ఇప్పటివరకు కేవలం ఆరుగురు పిల్లలు మాత్రమే పుట్టారు. స్వీడిష్ బృందం చేసిన శస్త్రచికిత్సల ద్వారానే వీరంతా పుట్టడం విశేషం.