: నిరుపేద మహిళ ఇంటి పునాదిలో బయటపడ్డ 435 బంగారు నాణేలు.. ప్రభుత్వానికి స్వాధీనం!
పేదరికం కారణంగా జీవితం దుర్భరంగా ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం తన నీతిని వదులుకోలేదు. తన నీతిని పక్కనపెడితే జీవితాంతం హాయిగా బతికేయవచ్చు. కానీ, ఆమె మన:సాక్షి దానికి అంగీకరించలేదు. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో బాణసముద్ర అనే గ్రామంలో లక్ష్మమ్మ (55) అనే మహిళ నివసిస్తోంది. తన ఇంటికోసం తీస్తున్న పునాదిలో ఏకంగా 435 పురాతన బంగారు నాణేలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో, ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోమని కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. అయినా కూడా ఆమె ఎవరి సలహా పాటించలేదు. తనది కానిది తనకు వద్దంటూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం గురించి వివరించింది. దీంతో, వారు ఆమె ఇంటికి వచ్చి బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మోర్వో ద్వారా వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాణేలను పరిశీలన కోసం పురావస్తు శాస్త్రవేత్తలకు అందజేశారు. ఎంతో నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మమ్మపై తోటి గ్రామస్తులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు ప్రశంసలు కురిపించారు.