: నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం కోరిన సచిన్ టెండూల్కర్


భారత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన జీవిత చరిత్రపై త్వరలో రానున్న చిత్రం 'సచిన్ - ఏ బిలియన్ డాలర్ డ్రీమ్స్' గురించి వివరించేందుకు సచిన్ స్వయంగా వెళ్లి మోదీని కలిశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీకి 'సచిన్ - ఏ బిలియన్ డాలర్ డ్రీమ్స్' గురించి చెప్పి ఆయన ఆశీర్వాదం కోరాను. 'జో ఖేలే - వహీ ఖిలే' (ఎవరైతే ఆడతారో వారే వికసిస్తారు) అని ఆయన ఉత్తేజకరమైన సందేశాన్ని ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. ఇదే సమావేశంపై మోదీ స్పందిస్తూ, సచిన్ ను కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అతని జీవిత ప్రయాణం 125 కోట్ల మంది భారతీయులను గర్వపడేలా చేసిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 26న  'సచిన్ - ఏ బిలియన్ డాలర్ డ్రీమ్స్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సచిన్ తో పాటు ఆయన భార్య అంజలి, చిత్ర నిర్మాత, దర్శకుడు కూడా మోదీని కలిశారు.

  • Loading...

More Telugu News