: కుమారుడి మృతిపై మెర్సిడిస్ బెంజ్ ని కోర్టుకు లాగనున్న మంత్రి నారాయణ
తన కుమారుడు నిషిత్ నారాయణ మృతిపై మెర్సిడిస్ బెంజ్ సంస్థను కోర్టుకు లాగాలని ఏపీ మంత్రి పొంగూరు నారాయణ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నిషిత్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ లో ఓ మెట్రో పిల్లర్ ను బలంగా ఢీ కొనగా, ఆయన అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన అత్యంత ఘోరమైనది కావడం, కారు నామరూపాల్లేకుండా దెబ్బతినడంతో, జర్మనీ నుంచి బెంజ్ కంపెనీ ప్రతినిధులు వచ్చి ప్రమాద స్థలిని, కారును పరిశీలించి తమ రిపోర్టును అందించారు.
అమిత వేగంతో ప్రయాణించినప్పటికీ, కారులోనూ సాంకేతిక లోపాలున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఎంత ప్రమాదం జరిగినా, లోపలున్న వారికి ప్రాణహాని కలుగకుండా ఏర్పాట్లున్న కారులోని కొన్ని లోపాలు కూడా నిషిత్ మరణానికి కారణమని వారు పేర్కొనడంతో, దీనిపై కోర్టుకు వెళ్లాలని మంత్రి నారాయణ భావిస్తున్నారు. నివేదికను పరిశీలించిన తరువాత, న్యాయ నిపుణులతో చర్చించి ఈ విషయంలో ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.