: ఆన్ లైన్ రెస్టారెంట్ గైడ్ 'జొమాటో'కు షాక్ ఇచ్చిన హ్యాకర్లు
హ్యాకింగ్ భూతానికి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలు తల్లడిల్లిన సంగతి తెలిసిందే. తాజాగా హోటళ్లకు సమాచారం అందజేసే ఆన్ లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమాటోకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఈ సంస్థకు చెందిన 1.70 కోట్ల ఖాతాలు సైబర్ దాడికి గురయ్యాయి. ఈ విషయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా జొమాటో నిర్వాహకులు తెలిపారు. తమ డేటా బేస్ లో ఉన్న సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారని చెప్పారు. ఖాతాదారుల పేర్లు, పాస్ వర్డ్ లను హ్యాకర్లు చోరీ చేశారని తెలిపారు. తమకున్న 12 కోట్ల వినియోగదారుల్లో 1.70 కోట్ల యూజర్ల డేటా చోరీ అయిందని చెప్పారు. మిగిలిన ఖాతాదారులంతా వెంటనే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని... అన్నిటికీ ఒకే పాస్ వర్డ్ వినియోగించకూడదంటూ హెచ్చరించారు. అయితే పేమెంట్ కు సంబంధించిన డేటాను అత్యంత భద్రమైన వ్యవస్థలో ఉంచినందువల్ల ఈ సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించలేక పోయారని చెప్పారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టంను మెరుగు పరుస్తామని వారు హామీ ఇచ్చారు.