: జైలు జీవితం సంజయ్ దత్ లో ఎంత మార్పు తెచ్చిందంటే...!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం గురించి చాలా మందికి తెలిసిందే. సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి వున్న కేసులో దోషిగా తేలి, జైలు జీవితం గడిపి వచ్చాడు. అయితే, సంజయ్ జైలు శిక్ష పూర్తి చేసుకున్నప్పటికీ జైలు జీవితాన్ని మాత్రం మర్చిపోలేదు. తాను జైలు పాలయ్యేందుకు ప్రధానం కారణం మాదక ద్రవ్యాలకు బానిసగా మారడమేనని గుర్తించాడు. దీంతో అమెరికాలోని డీ (డ్రగ్) ఎడిక్షన్ సెంటర్ లో చేరి చికిత్స తీసుకొని మామూలు మనిషయ్యాడు. తనలాంటి అభాగ్యులను మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వంతో చేతులు కలిపి దేశవ్యాప్తంగా డీ ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ సందర్భంగా దీనిపై సంజయ్ దత్ మాట్లాడుతూ, ‘నేను మాదకద్రవ్యాల అలవాటు నుంచి బయటపడటానికి అమెరికాలో ఖరీదైన చికిత్స తీసుకున్నాను. నా కుటుంబం దానికయ్యే ఖర్చును భరించగలదు. కానీ నాలా డ్రగ్ అడిక్టర్లందరికీ ఈ చికిత్సను భరించే ఆర్ధిక స్థోమత ఉండదు కదా!...అందుకే మన దేశంలోనే డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నాను. మాదకద్రవ్యాల అలవాటు నుంచి బయటపడాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా కొన్ని డీ ఎడిక్షన్ సెంటర్లను ప్రారంభించాలని ప్రణాళికలు తయారు చేశాను. ఇందుకోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నాను. అనుమతులు రాగానే పని మొదలుపెడతా’నని అన్నాడు.