: లైవ్ ఇంటర్వ్యూకు అడ్డొస్తోందని యువతిని తాకరాని చోట తాకిన బీబీసీ రిపోర్టర్... వీడియో వైరల్!
బెన్ బ్రౌన్... ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ బీబీసీలో పేరున్న రిపోర్టర్. అతని కార్యక్రమాలకు అభిమానులు ఎందరో. అటువంటి బెన్, ఓ లైవ్ లో భాగంగా ఇంటర్వ్యూ చేస్తున్న వేళ, జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రాడ్ ఫోర్డ్ లోని ఓ ప్రాంతంలో జరిగిన ఇంటర్వ్యూలో నార్మన్ స్మిత్ ను బెన్ ప్రశ్నిస్తుండగా, ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉండి జరుగుతున్నది చూడకుండా, మధ్యలో కల్పించుకుంటూ, 'ఆబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్' అంటూ ఏదో మాట్లాడబోయింది. ఆ సమయంలో తన కుడి చేతిలో మొబైల్ ఫోన్, మరో పుస్తకాన్ని పట్టుకుని ఉన్న బెన్, ఎడమ చేతితో ఆమెను పక్కకు నెట్టాడు.
అంతవరకూ ఓకే, ఆ చెయ్యి పడిన ప్రాంతమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనుకోకుండానే జరిగినా, ఆ యువతి గుండెలపైనే బెన్ చేయి పడటం, అది లైవ్ లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఈ ఘటన తరువాత సదరు యువతి సైతం లైట్ గా తీసుకుంటూ, బెన్ భుజంపై ఓ మారు తట్టి వెళ్లిపోయింది. ఆపై బెన్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఇది దురదృష్టవశాత్తూ జరిగిందని, కావాలని చేసింది కాదని, ఇంటర్వ్యూ మధ్యలో అంతరాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో బెన్ ను కొందరు విమర్శిస్తుండగా, ఆయన తప్పేముందని మరికొందరు వెనకేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Unfortunate interruption of broadcast in Bradford - just tried to minimise disruption but v tricky live on air - completely unintentional
— Ben Brown (@BenBrownBBC) May 16, 2017