: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం రేపే!.. బీజేపీకి తీవ్ర నిరాశ!
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న అంటే శుక్రవారమే ఆయన ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ‘కబాలీ’ నిర్ణయంతో బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. ఆయన అండగా రాష్ట్రంలో కాలుమోపాలని భావించిన బీజేపీకి ‘బాబా’ ఝలక్కిచ్చాడు. గతంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోదీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రి పదవిని సైతం ఆశ చూపినప్పటికీ ‘తలైవా’ చలించలేదు.
తాజాగా అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ శుక్రవారం జరగనున్న ముగింపు సమావేశంలోనే తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో ఆయన పలుమార్లు అభిమానులతో సమావేశమైనా ప్రస్తుత సమావేశాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు సరికొత్తగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే రాజకీయాల్లోకి రావడం తథ్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారడంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే రాజకీయ అరంగేట్రం చేయనున్న రజనీకాంత్ సొంతపార్టీ పెట్టాలంటూ అభిమానులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.