: ఆఫ్ఘాన్ రేడియో స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి
ఆఫ్ఘనిస్థాన్ లో ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జలాలాబాద్ లోని రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (ఆర్టీఏ) భవంతిలోకి చొరబడ్డ ముష్కరులు బీభత్సం సృష్టించారు. టీవీ స్టేషన్ లో పని చేస్తున్న కొంత మందిని బందీలుగా చేసుకున్నట్టుగా సమాచారం. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ, దుండగులు ఎందుకు చొరబడ్డారనే విషయం తెలియదని, ముగ్గురు దుండగులు టెలివిజన్ భవంతిలోకి చొరబడగా, అందులో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నట్టు చెప్పారు. మరో దుండగుడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఆర్టీఏ భవంతి నుంచి కాల్పుల శబ్దాలు వినపడుతున్నాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంత వరకూ ప్రకటించలేదు.