: అసెంబ్లీలో ఎందుకు నిద్రపోయారు? మీకు ఇక్కడ నిద్ర ఎలా వస్తోంది?: తమ ఎమ్మెల్యేలపై సీఎం యోగి సీరియస్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తొలిసారిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న శాసనసభలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపే అంశంపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్ర అధికార భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు గాఢంగా నిద్రపోయిన విషయం తెలిసిందే. అందులో ఓ మంత్రి కూడా ఉండడం గమనార్హం. ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయాలని ఆయన నిర్ణయించుకొని, అందుకు ఆదేశాలిస్తే ఇటువంటి ఘటన కనిపించినందుకు ఆయన తమ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు.
అసెంబ్లీలో నిద్రపోయిన మంత్రిని యోగి తన ఛాంబర్ కు పిలిపించుకుని మరీ హెచ్చరించారు. మంత్రి పదవిలో ఉండి ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే నిద్ర ఎలా వస్తుందని ఆయన నిలదీశారు. ఆ మంత్రి ఈ ఘటనపై వివరణ ఇచ్చుకొని క్షమాపణలు కోరారట. తాను రాత్రంతా తన నియోజకవర్గంలో పర్యటించడం వల్ల నిద్ర ముంచుకొచ్చిందని చెప్పారట. అసెంబ్లీ సమావేశాలలో ఇకపై ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదని యోగి తమ శాసనసభ్యులను హెచ్చరించారు.