: అనుమానంతో... రైల్లోంచి భార్యను తోసేసిన భర్త!
ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం కడవకుదురు దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం తన భార్యతో కలిసి రైల్లో బయలుదేరిన ఓ వ్యక్తి అందులోనే ఆమెతో గొడవపడి కదులుతున్న రైల్లోంచి ఆమెను బయటకు నెట్టేశాడు. దీంతో ఆమె మరణించింది. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకి సమాచారం అందించారు. తన భార్యపై అనుమానంతోనే ఆ వ్యక్తి ఆమెను రైల్లోంచి తోసేశాడని ప్రయాణికులు పోలీసులకు చెప్పారు. సదరు భార్యాభర్తల పేర్లు సంతోష్ కుమార్, కల్పనగా తెలుస్తోంది. కల్పన ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెపై సంతోష్ అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.