: 40 ఏళ్లు ఏపీలో దాక్కుని స్వస్థలమైన రాజస్థాన్ కు వెళ్లి అరెస్టయిన నిందితుడు... రూ. 100 జరిమానా
1976లో కల్తీ పాలతో స్వీట్స్ తయారు చేస్తున్నాడని నమోదైన కేసులో అరెస్టును తప్పించుకునేందుకు ఏపీకి పారిపోయి వచ్చిన ఓ వ్యక్తి, 40 సంవత్సరాల తరువాత తిరిగి తన స్వగ్రామానికి వెళ్లి అరెస్టు కాగా, కోర్టు రూ. 100 జరిమానా విధించి వదిలేసింది. రాజస్థాన్ లోని నాగౌర్ లో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, మోతీలాల్ అనే వ్యాపారి కల్తీ పాలను వాడుతుండటంపై కేసు నమోదు కాగా, అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
అయితే, పోలీసుల కన్ను గప్పి పారిపోయిన 25 ఏళ్ల మోతీలాల్, ఆంధ్రప్రదేశ్ కు వచ్చి, ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని 40 ఏళ్లు కాలం గడిపాడు. ఇటీవల తన భార్య చనిపోయిందని తెలుసుకున్న అతను 65 ఏళ్ల వయసులో తిరిగి నాగౌర్ వెళ్లాడు. పాత కేసుల విచారణలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు మోతీలాల్ తారసపడటంతో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి, అతని వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూ. 100 జరిమానా మాత్రం విధించి విడిచిపెట్టారు.