: కాలేజీలో మొదలైన ప్రేమకథ... పెళ్లితో ఒకటైనా, మూన్నాళ్లకే విషాదాంతం!


తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ప్రేమకథ, ముంబైలో పెళ్లిపీటలు ఎక్కినప్పటికీ, చివరికి విషాదాంతమైంది. కోర్టు ఆదేశాల మేరకు అమ్మాయి తుమ్మల స్వాతిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడానికి 20 గంటల ముందు ఆమె ఆత్మహత్య చేసుకోగా, అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అంబోజి నరేష్, తుమ్మల స్వాతిలు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడి, ఈ సంవత్సరం మార్చి 25న వివాహం చేసుకుని ముంబైలో కాపురం పెట్టారు. నరేష్ తో పోలిస్తే, స్వాతి అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి కావడంతో, సహజంగానే ఆమె తల్లిదండ్రులు పెళ్లిని వ్యతిరేకించగా, స్వాతి, నరేష్ తో కలసి వెళ్లిపోయింది. ఆపై స్వాతి ఎక్కడుందో తెలుసుకున్న భువనగిరిలోని ఆమె కుటుంబం, అల్లుడిని ఆహ్వానిస్తామని హామీ ఇచ్చి ఈ జంటను ఇంటికి రావాలని కోరింది.

ఆపై కొత్త జంట ఈ నెల 2వ తేదీన భువనగిరికి రాగా, స్వాతిని ఆమె తండ్రి తీసుకెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి నరేష్ అదృశ్యమయ్యాడు. నరేష్ సోదరుడు వెంకటయ్య, తన సోదరుడు కనిపించడం లేదని కోర్టును ఆశ్రయించాడు కూడా. ఈ కేసు విచారణలో భాగంగా, మూడు రోజుల్లోగా స్వాతిని తమ ముందు ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించగా, ఆమె టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ తాగి, చికిత్స పొంది ఇంటికి వచ్చి, ఆపై గంటల వ్యవధిలోనే ఉరేసుకుని మరణించింది. తన కుమార్తెను కట్నం కోసం అల్లుడు హింసించడంతోనే ఆమె మనస్తాపంతో మరణించిందని స్వాతి తండ్రి ఆరోపిస్తుండగా.. తన కుమారుడి ప్రాణాలకు అపాయం ఉందని, స్వాతిని కూడా ఆమె తల్లిదండ్రులే హత్య చేసి వుండవచ్చని నరేష్ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ కేసును మరింత లోతుగా విచారించాలని, నరేష్ ఆచూకీ తెలుసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News