: రాజకీయాల్లో రజనీ ఎంట్రీ తథ్యం... భవిష్యత్ పై జ్యోతిష్యుల అంచనా
అతి త్వరలోనే దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారని తమిళనాడులో జ్యోతిష్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆయనకు రాజయోగం ఉందని, రాష్ట్రానికి సీఎంగా కూడా పని చేయనున్నారని భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. నేడు మూడవ రోజున కూడా రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం అయ్యారు. ఇక వేదిక వెనుక ఉంచిన పోస్టరులో ఓ కమలంపై 'బాబా ముద్ర' లోగోగా కనిపిస్తుండటంతో దీనిపై తమిళనాట పెద్ద చర్చే జరుగుతోంది.
ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని, అందువల్లే కమలాన్ని కూడా తన గుర్తులో చేర్చుకున్నారని అంటున్నారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ఇంతవరకూ ఆయన నోటి నుంచి ఎటువంటి ప్రకటనా రాకపోయినా, ప్రసంగాల్లో మాత్రం రాజకీయాలకు సంబంధించి ఏదో ఒక మాట వస్తుండటం గమనార్హం. తొలి రోజు ప్రస్తుతానికి నటుడినని, భవిష్యత్తులో దేవుడు ఆదేశిస్తే ఏమైనా జరగవచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆయన, రెండో రోజున తాను రాజకీయాల్లోకి వస్తే, అవినీతి పరులను దగ్గర చేర్చబోనని, ఓ సారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయబోనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.